సాగు నీటి కై బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద రైతుల ధర్నా

0
47

బుగ్గారం తాజా కబురు: రైతులు సాగు చేసిన పంట పొలాలకు సాగు నీరు అందక వేసిన పంటలు ఎండిపోతున్నాయని వెంటనే సాగు నీరు అందించాలని డిమాండ్ చేస్తూ శనివారం మధ్యాహ్నం బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద రైతులు ధర్నా చేశారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల రైతులు, బుగ్గారం మండలంలోని కింది గ్రామాల రైతులు ఈ ధర్నా లో రాజకీయాలకు అతీతంగా ఆందోళన నిర్వహించారు. జగిత్యాల – ధర్మపురి ప్రధాన జాతీయ రహదారి పై ఈ ధర్నా గంటకు పైగా సాగింది. మండుతున్న ఎర్రని ఎండలో కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ పంటలు ఎండిపోకుండా సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. సాగు నీటి సాధనకై రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నాయకుల, ప్రభుత్వ నిర్లక్షాలపై రైతులు మండిపడ్డారు. వెల్గటూర్ మండలంలోని వెంకటాపూర్, లొత్తునూర్, స్థంభంపల్లి, బొంకూర్ లతో పాటు మరికొన్ని గ్రామాల రైతులు, బుగ్గారం మండలం లోని బీర్సాని, సిరికొండ తదితర గ్రామాల రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. సమాచారం తెలుసుకున్న బుగ్గారం ఎస్సై ఉపేంద్రా చారి హుటాహుటిన వెళ్లి రైతులకు తగిన విధంగా సర్దిచెప్పి ధర్నా విరమింపజేశారు. ఆదివారం లోగా తమ పంటలకు తగినంత సాగునీరు అందకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు రైతులు పేర్కొన్నారు.

సాగునీటి సాధనకై రైతులకు అండగా నిలిచి పోరాడుతాం : అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చుక్క గంగారెడ్డి

ఎండిపోతున్న పంటలకు తగిన సాగునీరు ఎస్సారెస్పీ కాలువ ద్వారా తక్షణమే అందించాలని, లేనిపక్షంలో రైతులకు అండగా నిలిచి సాగునీటి సాధనకై, రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యల పై రైతులకు అండగా నిలిచి పోరాడుతామని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి లు తెలిపారు. ఎండిన, ఎండుతున్న పంట పొలాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి తగు నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి కొప్పుల ఈశ్వర్ వెంటనే స్పందించి ధర్మపురి నియోజకవర్గముతో పాటు జిల్లాలోని అన్ని ప్రాంతాల పంట పొలాలకు తగినంత ఎస్సారెస్పీ నీటిని వెంటనే విడుదల చేయించాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన నిలిచి పోరాటాలు, ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here