వరిధాన్యం దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోండి

0
226

వరిధాన్యం దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోండి

తహసీల్దార్ కు జనసమితి జిల్లా అధ్యక్షుడి విజ్ఞప్తి

బుగ్గారం తాజా కబురు:వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న దోపిడీని అరికట్టి రైతులను ఆదుకోవాలని బుగ్గారం తహశీల్దార్ కు తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన బుగ్గారం తహశీల్దార్ డి.సుజాతకు ఒక విజ్ఞాపన పత్రం అందజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మోసాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. 40కిలోలు తూకం వేయాల్సిన బస్తాకు 42 కిలోల వరకు వరిధాన్యం తూకం వేస్తున్నారని, దీనితో రైతు క్వింటాలు వడ్లకు 5కిలోలు అదనంగా నష్టపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాంటి తప్ప తాలు లేకుండా, మట్టి, నరిగే లేకుండా 100 శాతం శుద్దిగా ఉన్న వడ్లను కూడా సంచికి ఒకంటికి 42కిలోల చొప్పున తూకం వేసి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను అధికంగా తూకం వేసి దోచుకునే ధాన్యంలో అధికారులకు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు, గ్రామ స్థాయి నాయకుల (ప్రజా ప్రతినిధుల) నుండి మంత్రుల దాకా వాటా వెల్తున్నట్లు రైతులు, రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, రైస్ మిల్లర్లు కూడా ఆరోపిస్తున్నట్లు ఆయన తహశీల్దారుకు వివరించారు. ఈ వరిధాన్యం దోపిడీ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన తహసీల్దార్ సుజాతను కోరారు. తక్షణమే వరిధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న దోపిడీలను అరికట్టి రైతులను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంచికోకంటికి 2కిలోల చొప్పున అధిక ధాన్యాన్ని ఆయా రైతుల ఖాతాలో జమకట్టి, జోకిన ప్రతి కిలో వరి ధాన్యానికి డబ్బులు చెల్లించాలని తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షుడు చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇకముందు ఇలాంటి దోపిడీలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆయన తహసీల్దార్ ను కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here