లాక్‌డౌన్‌‌పై తెలంగాణ పోలీసుల కొత్త నిబంధనలు

0
137

తాజా కబురు హైదరాబాద్ డెస్క్:లాక్‌డౌన్‌‌పై తెలంగాణ పోలీసుల కొత్త నిబంధనలు. నిత్యావసరాలకు 3 కిలోమీటర్లు లోపు మాత్రమే మరియు రెసిడెన్సీ ఫ్రూప్ చూపించాల్సిందే!

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 21 నుంచి లాక్ డౌన్ కఠినంగా అమలు చేస్తామని డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు ఉన్నతాధికారులతో పకడ్బందీ లాక్ డౌన్ అమలుపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం లాక్ డౌన్ విషయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారుల నియంత్రణపై కఠిన స్థాయిలో నిర్ణయాలు తీసుకోనున్నట్టు నొక్కి చెప్పారు. అత్యవసర సరుకుల సరఫరాకు కొందరికి పాసులు ఇచ్చామన్నారు. అవసరం లేకున్నా ఆ వాహనదారులు పాసులతో రోడ్లపైకి వస్తున్నారని, పాసులు కలిగిన వ్యక్తి తిరగాల్సిన ప్రదేశాలను గుర్తించామన్నారు. వాహనదారులకు ఇచ్చిన పాసులపై సమీక్ష చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారుల పాసులను వెంటనే రద్దు చేస్తామని మహేందర్ రెడ్డి చెప్పారు.

పాసు ఉన్న వ్యక్తి ఏ సమయానికి ఏ మార్గంలో వెళ్లాలనే విషయం గుర్తిస్తామని తెలిపారు. కొత్త పాసులు ఇచ్చేంత వరకు పాత పాసులు కొనసాగిస్తామన్నారు. నిత్యవసరాల కొనుగోలుకు కనీసం 3 కిలోమీటర్ల లోపు మాత్రమే వెళ్లాలని మహేందర్ రెడ్డి సూచించారు. వాహనదారులు రెసిడెన్స్‌ ప్రూఫ్‌తోనే బయటకు రావాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులకు మాత్రం పాసులు ఇస్తామన్నారు.కలర్‌ కోడ్‌ ప్రకారం.. సంస్థలు ఉద్యోగులకు పాసులు ఇవ్వాలని పోలీసులకు సూచించారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటివరకూ 1.21 లక్షల వాహనాలు సీజ్ చేశామన్నారు. లాక్ డౌన్ పూర్తయిన వెంటనే ఆయా వాహనాలను కోర్టులో డిపాజిట్ చేస్తామని చెప్పారు. కోర్టు ద్వారానే వాహనాదారులు ఆ వాహనాలను తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
సాధారణ జబ్బుల చికిత్సకు సమీప ఆస్పత్రులకు వెళ్లాలని ఆయన సూచించారు. తీవ్ర ఆరోగ్య సమస్య ఉండి దూరం వెళ్తే రిఫరెన్స్ పత్రాలు వెంట తీసుకురావాలన్నారు. ఆస్పత్రులకు వెళ్లే వారు కూడా రెసిడెన్స్ ప్రూఫ్స్ తీసుకురావాలని డీజీపీ సూచనలు చేశారు. రేషన్ దుకాణాలు, బ్యాంకుల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, ఆహార పంపిణీ చేసేవారు భౌతిక దూరం పాటించే బాధ్యత తీసుకోవాలని డీజీపీ సూచనలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here