రైతన్న పై కన్నెర్ర చేసిన అకాల వర్షం తాలు, తప్ప అంటూ మిల్లర్ల ముప్పు తిప్పలు అధికారుల మాటలు లెక్కచేయని మిల్లర్ల యాజమాన్యం

0
274

రైతన్న పై కన్నెర్ర చేసిన అకాల వర్షం

తాలు, తప్ప అంటూ మిల్లర్ల ముప్పు తిప్పలు

అధికారుల మాటలు లెక్కచేయని మిల్లర్ల యాజమాన్యం

తడిది ముద్దయిన వరి ధాన్యం, పసుపు

నేలరాలిన మామిడి

రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో వరద నీటి నుండి ధాన్యం తీస్తున్న మహిళా రైతు

జగిత్యాల,రాయికల్ ప్రతినిధి తాజా కబురు: యాసంగి పంటకు రందిలేదు. పుష్కలమైన నీటితో సిరులు పండాయి. ఈ సారి దశ తిరిగినట్లే అని సంతోషపడుతున్న తరుణంలో, తాలు తప్ప అంటూ ఓవైపు రైతులను మిల్లర్ల యాజమాన్యం ముప్పు తిప్పలు పెడుతుంటే రైతన్నపై కాలం కూడా కన్నెర్రచేస్తుంది. అకాల వర్షం అన్నదాత నెత్తిన పిడుగై పడింది. తెగుళ్లకు, పెట్టుబడులకు ఓర్చి చేలోంచి కల్లాల్లోకి తీసుకొచ్చిన ధాన్యం వరణుడి పాలైంది. జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో చాలా చోట్ల వరిధాన్యం నీటిపాలైంది. అసలే దిగుబడి అంతంతే ఉన్న మామిడి మరోసారి దెబ్బతింది. పసుపు ఉడకబెట్టి 10 రోజులయే, కరోనా నేపథ్యంలో ట్రాన్స్‌పోర్టులేక కల్లాల్లోనే ఉన్న పసుపు ఇక కాంట పెట్టుడే అనే సమయంలో తడిసి ముద్దయింది.

రాయికల్ మండలం ఆలూరు లో తడిసిన పసుపు

జిల్లాలోని రాయికల్, సారంగాపూర్, కోరుట్ల, మేడిపెల్లి, బీర్పూర్ మండలం లోని పలు గ్రామాల్లో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వర్షం కురవడంతో ఆరుబయట,కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న వరిధాన్యం తడిసి ముద్దయింది. అసలే రైతన్నలను ఓ వైపు తాలు, తప్ప అంటూ మిల్లర్లు సతాయిస్తున్న తరుణంలో ఆరు గాలుల పాటు పండించి, కష్ట నష్టాలు భరించి చేతికి ముద్ద వస్తది అనే సమయంలో అకాలవర్షం కురియడంతో రైతుల కంట నీరు తెప్పిస్తుంది.

తాలు, తప్ప అంటూ మిల్లర్ల ముప్పు తిప్పలు
అధికారుల మాటలు లెక్కచేయని మిల్లర్ల యాజమాన్యం

40 కిలోల బస్తాకు అదనంగా 2 కిలోలు తూకం వేస్తూ దండుకుంటున్నారు. అధికారుల మౌఖిక ఆదేశాలతోనే అదనంగా 2 కిలోలు తూకం వేస్తున్నామంటూ నిర్వాహకులు రైస్‌ మిల్లర్లకు పరోక్షంగా సహకరిస్తున్నారు.రాయికల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అధికారులు మంగళవారం ధాన్యం తూకం వేసి మండల పరిధిలోని ఓ మిల్లర్ కు పంపగా ధాన్యం లో తాలు, తప్ప అధికంగా ఉందని మల్లి ధాన్యం తూకం వేయాలని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఓ వైపు అధికారులు రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు అని చెపుతున్న పట్టించుకోకుండా నిబంధనలను తుంగలో తొక్కి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము అధికారులు మిల్లర్లతో చేతులు కలిపి మాకు ఏం తెలియదు మీరే మిల్లర్లతో మాట్లాడుకోండి అని రైతులకు సలహాలు ఇస్తున్నారని జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి కుర్మ మల్లారెడ్డి తాజా కబురుతో తెలిపారు.

నేలరాలిన మామిడి

రాయికల్ మండలం కొత్తపేటలో గ్రామంలో నేల రాలిన మామిడి

జిల్లాలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి మామిడి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కోతకు వచ్చిన మామిడి కాయలు పూర్తిగా నేలరాలాయి. జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాలలో మామిడి పంట పూర్తిగా దెబ్బ తినడంతో ఈ సారి జిల్లాలో మామిడి రైతుల ఆశలు అడియాశలయ్యాయ.నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here