పల్లెల్లో గుడుంబా జోరు- వైన్స్ షాపుల బంద్ బెల్ట్ షాపులో ఫుల్ – మూడింతల ధరలకు మద్యం అమ్మకాలు

0
253


జగిత్యాల జిల్లాలో గుడుంబా గుప్పుమంటూ పల్లెలన్నీ పరిశ్రమలుగా మారుతున్నాయి. ఆబ్కారీ అధికారులు మాత్రం చూసి చూడనట్లుగా నామమాత్రం తనిఖీలు చేస్తున్నారని పలువురు వాపోతున్నారు . గ్రామాలలో ప్రజలు,ప్రజా ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి.ఇక లాభం లేక వారే తెగించి గుడుంబా బట్టీలపై దాడులు చేసి ధ్వంసం చేసినా నిద్రమత్తులో ఉన్న ఆబ్కారీశాఖకు మాత్రం చలనం రావడం లేదని జనం అంటున్నారు.

నేడు పల్లెల్లో గుప్పుమంటూ తయారవుతున్న నాటుసారాపై ప్రజా ప్రతినిధులు, గ్రామస్తుల దాడులు చేసినా అధికారుల్లోఏమాత్రం చలనం రావడం లేదంటే అనేక అనుమానాలకు తావిస్తోంది. కరోనా ఎఫెక్ట్ తో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు బందుకావడంతో కల్తీ మద్యం, చీప్ లిక్కర్ తయారీ గుడుంబా వ్యాపారాలు జిల్లాలో మళ్లీ జోరందుకున్నట్లు సమాచారం.

జగిత్యాల జిల్లాలోని మారుమూల పల్లెల్లో రహస్య స్థావరాలలో మళ్ళీ గుడుంబా బట్టీలు కుటీర పరిశ్రమలుగా వెలిశాయి. ఇదే అవకాశంగా భావించిన కొందరు గుడుంబా తయారీదారులు,గుడుంబా వ్యాపారులు బెల్లం, మురిగిన పండ్లు, మురిగినకూరగాయలు కొనుగోళ్లు చేసి గుడుంబా తయారు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పెగడపల్లి మండలం మద్దులపల్లి గ్రామంలో గుడుంబా తయారీ కోసం ఓ వ్యక్తి ఇంట్లో సిద్ధంగా ఉంచిన 70 లీటర్ల బెల్లం పానకాన్ని అధికారులు పట్టుకున్నారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో గత 15 రోజుల క్రితం గ్రామ ప్రజా ప్రతినిధులు,యువత గుడుంబా స్థావరాలనుగుర్తించి దాడులు నిర్వహించారు. గుడుంబా బట్టీ నిర్వాహకులు, గుడుంబా వ్యాపారులు గ్రామస్తులను చూసి అక్కడి నుండి పారిపోయారు. అక్కడ ఉన్న గుడుంబా,బట్టీలు, డ్రమ్ములలో నిల్వ చేసిన బెల్లం పానకం, గుడుంబా తయారీ ముడి
సరుకులను వారు ధ్వంసం చేశారు.

జిల్లాలోని రాయికల్, సారంగాపూర్, బీర్పూర్,ధర్మపురి, మల్లాపూర్, కథలాపూర్, మేడిపల్లి తదితర మండలాలలోని వివిధ మారుమూల గ్రామాలలో గుడుంబా బట్టీలు వెలసి జోరుగా నాటుసారా అమ్మకాలు చేస్తున్న అధికారులు నామమాత్ర తనిఖీలతో చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.ఈ గుడుంబా కోసం పక్క జిల్లాల నుండి కూడా గుడుంబా ప్రియులు వచ్చి కొనుగోలు చేస్తూ వారి వారి జిల్లాలకు రాత్రివేళలో గుట్టుచప్పుడుకాకుండా తరలిస్తున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ నేపత్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైన్స్ దుకాణాలు సీజ్ చేసిన అధికారులు గ్రామాల్లో ఉన్న బెల్ట్ షాపులను మాత్రం కట్టడి చేయలేకపోతున్నారు. పట్టణాల్లోని బార్, రెస్టారెంట్లలో మరియు కొన్ని వైన్స్ దుకాణాలకు వెనుక భాగంలో ఉన్న దారి గుండా రాత్రి వేళా మద్యం బాటిళ్లు తీసుకవచ్చి గ్రామాల్లో మూడింతల ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్నట్లు మందు బాబులు చర్చించుకుంటున్నారు

ఇప్పటికైనా జిల్లా ఆబ్కారీ శాఖ యంత్రాంగం, రాష్ట్ర అధికార యంత్రాంగం తక్షణమే స్పందించి గుడుంబా తయారీని, బెల్ట్ షాపులను అరికట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో ఇంటింటా గుడుంబా పరిశ్రమలు, గ్రామాల్లో పుట్టగొడుగుల్లా బెల్టషాప్ లు వెలుస్తాయని తద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని ప్రజలు వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here