చనిపోయిన 145 రోజులకు సౌదీ నుండి స్వదేశానికి చేరిన మృతదేహం కొండాపూర్ లో రేపు అంత్యక్రియలు

0
131

జగిత్యాల తాజా కబురు:సుదూర దేశంలో చనిపోయిన ఆప్తుని చివరిచూపుకోసం కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు అయిదు నెలలుగా ఎదిరిచూస్తుండగా చివరికి ఆ గల్ఫ్ మృతుడి శవపేటిక శనివారం సాయంత్రం హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సంఘటన జరిగింది. 

వెలగటూరు మండలం కొండాపూర్ గ్రామానికిచెందిన సుంకె రాజయ్య (55) సౌదీ అరేబియా దేశంలోని రియాద్ లోని ఒక ఆసుపత్రిలో చిత్స పొందుతూ ఏప్రిల్ 14న చనిపోయాడు.లాక్ డౌన్ కారణంగా విమానాల రాకపోకలు నిలిపివేసినందున శవపేటిక ను ఇండియాకు పంపడంలో జాప్యం జరిగింది. ఈ విషయాన్ని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి జూన్ 21న ‘మదద్’ (కాన్సులార్ సర్వీసెస్ మేనేజ్మెంట్ సిస్టం – భారత రాయబార కార్యాలయాల్లో దౌత్య సంబంధమైన సేవల పర్యవేక్షణ వ్యవస్థ) పోర్టల్ ద్వారా రియాద్ లోని ఇండియన్ ఎంబసీ దృష్టికి తీసికెళ్ళారు. సుంకె రాజయ్య చనిపోయి నెలకుపైగా అయినప్పటికీ  ఈ విషయం ఎంబసీకి తెలియదని వెంటనే మరణాన్ని నమోదు చేసుకొని ప్రక్రియ ప్రారంభిస్తామని దౌత్య అధికారులు జీవన్ రెడ్డికి జవాబు ఇచ్చారు. యజమాని ఎగ్జిట్ పర్మిట్ సకాలంలో ఇవ్వనందున మృతదేహాన్ని పంపడం మరింత ఆలస్యం అయ్యింది. సౌదీ నుండి ఇండియాకు  మృతదేహాన్ని పంపడానికి సౌదీలోని తెలంగాణ సామాజిక సేవకుడు బడుగు లక్ష్మణ్ బృందం కృషి చేసింది.ఎట్టకేలకు సుంకె రాజయ్య శవపేటిక ఎమిరేట్స్ ఎయిర్ లైన్సు ద్వారా రియాద్ నుండి హైదరాబాద్ (వయా దుబాయి) శనివారం సాయంత్రం ఏడున్నరకు హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు  చేరుకుంటుందని ఇండియా నుండి ఎంబసీతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్న ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.  స్థానిక ధర్మపురి ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎన్నారై విభాగం హైదరాబాద్ నుండి కొండాపూర్ వరకు శవపేటిక రవాణాకు ఉచిత అంబులెన్సు  సౌకర్యం కల్పించారు. రాజయ్యకు భార్య శంకరమ్మ, కూతుళ్లు  గంగాజల, సోనియా, కుమారుడు  తిరుపతి ఉన్నారు. కష్టకాలంలో సహకరించిన తిగుల్ల సంజీవరెడ్డి, పోరెడ్డి చంద్రారెడ్డి లకు రాజయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

కష్టాల్లో ఉన్న గల్ఫ్ కార్మికులు గాని, వారి కుటుంబ సభ్యులు గాని సహాయం కోసం, సలహాల కోసం 24 గంటలు పనిచేసే భారత ప్రభుత్వ హెల్ప్ లైన్ (టోల్ ఫ్రీ) నెంబర్ 1800 11 3090 లేదా చార్జీలు వర్తించే నెంబర్లు  +91 11 4050 3090 మరియు +91 11 2307 2536 కు సంప్రదించవచ్చు. ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ హెల్ప్ లైన్ నెంబర్ +91 94916 13129 కు కూడా కాల్ చేయవచ్చు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here