ఎల్. ఆర్.ఎస్. విదానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

0
96

జగిత్యాల తాజా కబురు: కేవలం ఆదాయ సముపార్జన లక్ష్యంగా తెచ్చిన ప్రస్తుత ఎల్.ఆర్.ఎస్. విధానాన్ని ఉపసంహరించుకోవాలని, జి.ఒ. నంబర్ 131ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.సోమవారం టిజెఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా టిజెఎస్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో నిలిపి వేసిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, ప్లాట్ల క్రయ విక్రయాలను అనుమతించాలని డిమాండ్ చేశారు.పట్టణ,నగరాభివృద్ధి లక్ష్యంగా ప్రణాళికను ప్రకటించి దాన్ని అమలు చేయాలన్నారు. అందులో భాగంగా నామమాత్రపు ధరకు ప్లాట్లను, లే అవుట్లను క్రమబద్దికరించాలని, ఎట్టి పరిస్థితిలోను ప్రజల ఆస్తి హక్కుకు విఘాతం కలుగకుండా చూడాలని చుక్క గంగారెడ్డి సూచించారు. ఎల్.ఆర్.ఎస్. స్కీం వలన పేద, మధ్య తరగతి ప్రజలు ప్లాట్ల క్రయ-విక్రయాలలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించారు. ప్రభుత్వం జి.వో. 131 (తేదీ 31-8-2020) ద్వారా తెచ్చిన ఎల్.ఆర్.ఎస్. స్కీం పట్టణాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి దోహదపడకపోగా కరోనా కాలంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నదని అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు అవసరార్థం నగర శివార్లలో ప్లాట్లు కొనుక్కున్నారని, ఏ సమస్య వచ్చినా ఆ ప్లాట్ అమ్ముకొని ఖర్చులు తీర్చుకోవచ్చునని కొందరు, ఎప్పటికైనా స్వంత ఇళ్ళు నిర్మించుకోవచ్చునని కొందరు నిశ్చింతగా ఉంటే అప్పో సప్పో చేసి కొన్న పేదోడి ప్లాట్ ను అమ్ముకునేలా ప్రభుత్వం జీవో తెచ్చిందని ఎద్దేవా చేశారు. పేద ప్రజలపై 131 జి.వో. పిడుగులాగా పడిందన్నారు. జి.ఒ. 131 అన్ని ప్లాట్లను అక్రమ ప్లాట్లుగా మార్చివేస్తున్నదని, 2015 సంవత్సరంలో క్రమబద్దీకరణకు ప్రభుత్వం ఒక జి.వో.ను తెచ్చిందని, దాని పర్యవసానాలు అంచనావేయకుండానే, ఆ స్కీం పట్టణాభివృద్ధికి ఏ మేరకు దోహదపడిందో తేల్చకుండానే ఇప్పుడు ఇంకొక స్కీంను అదే పద్దతిలో తేవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
లే అవుట్లు అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాయని, సంబంధిత శాఖలు ఎదో రకంగా వాటిని ఆమోదిస్తున్నాయని, ప్లాట్లను అమ్ముతున్నప్పుడు ప్రభుత్వం ఎన్నడూ ఆపలేదన్నారు. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఎప్పడు వేలెత్తి ఏ తప్పును చూపలేదని, ఇన్నాళ్ళు మౌనంగా వున్న ప్రభుత్వం ఇప్పుడు ఆ లేఅవుట్లన్నీ అక్రమం అని ప్రకటిస్తున్నదని ఆరోపించారు. ఇది ఎంత వరకు న్యాయమో ఆలోచించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

టిజెఎస్ కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ
కొన్ని ప్లాట్లు అనేక పర్యాయాలు చేతులు మారినాయని, ప్రహరీ గోడలు, కరెంటు కనెక్షన్ తీసుకున్న వారు కూడా వున్నారని తెలిపారు. కొందరైతే ఇండ్లు కూడా నిర్మించుకున్నారని వాళ్ళ పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. అసలు ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే అనైతికంగా వున్నదని ఆరోపించారు.
2018లో తెచ్చిన పంచాయతీ రాజ్ చట్టాన్ని, 2019 లో తెచ్చిన మున్సిపల్ చట్టాన్ని వెనక తేదీ నుండి అమలు చేయడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొన్నారు. సహజ న్యాయసూత్రాల ప్రకారం ఏ చట్టమైనా ఆ చట్టం వచ్చిన తేదీనుండే అమలవుతుందని గ్రహించాలని సూచించారు. వాటిని దృష్టిలో పెట్టుకొని పూర్వపు తేదీ నుండి మార్చాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం కూడా అవుతుందన్నారు. లే అవుట్లలో ఎక్కువ వరకు ప్లాట్లు 200 నుండి 250 గజాల విస్తీర్ణం వుంటాయని, ఇప్పుడు ఆ లేఅవుట్ల రోడ్లను విస్తరించే క్రమంలో ప్లాట్లు కుదించుకొనిపోతున్నాయని, రెండు వైపులా రోడ్లు వుండే ప్లాట్లయితే వారి పరిస్థితి వర్ణణాతీతమన్నారు. అయినా వారినుంచి కూడా మొత్తం ప్లాటు విస్తీర్ణానికి రుసుములు వసూలు చేస్తున్నారని, పోయిన విస్తీర్ణానికి నష్ట పరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా ప్లాట్ విలువకన్నా చెలిస్తున్న రుసుములు ఎక్కువగా వున్నాయని తెలిపారు. క్రమబద్దీకరణకు చెల్లించవలసిన రుసుములు సవరించిన తరువాత కూడా చాలా ఎక్కువగా వున్నాయన్నారు. 100 చదరపు మీటర్లకు (గజానికి 1000 రూపాయల రిజిస్ట్రేషన్ విలువ అనుకుంటే) కనీసం 21000 రూపాయలు కట్టక తప్పదన్నారు. కరోనా కాలంలో చాలామందికి ఇది పెను భారంగా మారిందన్నారు. ఈ స్థాయిలో ప్రజలనుండి వసూలు చేయడం అన్యాయమే అవుతుందని ఆరోపించారు. ఈ వసూళ్ళు ఏ రీతిలో చూసినా సమర్థనీయం కాదన్నారు. ఈ రుసుముల వసూలు కోసం ఇవ్వాళ ప్రభుత్వం అక్రమ మార్గాన్ని అనుసరిస్తున్నదని, రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం రిజిస్త్రేషన్ ప్రక్రియను ఏ పరిస్థితిలోనూ ఆపటానికి వీలులేదన్నారు. నిషేధిత ఆస్తులను తప్ప ఇతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆపడమంటే రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కును కాలరాయడమేనని గ్రహించాలన్నారు. చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపి రుసుములు విధిగా చెల్లించాలని బలవంతపెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చట్టవ్యతిరేక పద్దతులల్లో ఈ రుసుములు వసూలు చేయడం పాతకాలంలో రాజులు, చక్రవర్తులు బలవంతంగా వసూలు చేసిన పద్దతిని తలపిస్తున్నదన్నారు.
రుసుములు కట్టలేని వారు అవసరార్థం ఎదో ఒక రేటుకు ప్లాట్లు అమ్ముకోవలసి వస్తున్నదని, ప్లాట్ల ధరలు కుడా భవిష్యత్తులో పేద, మధ్యతరగతి ప్రజలకు అందనంతగా పెరిగిపోనున్నాయన్నారు. పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వానికి తాము కొల్లగొట్టిన బొక్కసాన్ని తిరిగి నింపడం కోసం ప్రజల మెడ మీద కత్తి పెట్టి రుసుములు వసూలు చేయడం మీద వున్న శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద కాని, నగరాభివృద్ధి మీద కాని లేదని అర్థమవుతున్నదని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ కంతి మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎలుక కమలాకర్, జిల్లా ఉపాధ్యక్షులు కంతి ఆనందం, సహాయ కార్యదర్శి చింతకుంట శంకర్, ఆర్.మల్లయ్య, కె.సంజీవ్, చిట్యాల జలందర్, సత్యనారాయణ, లక్మినారాయణ, ఆంజనేయులు, గంగారాం, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here