ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భేషరతుగా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలి:చుక్క గంగారెడ్డి

0
43

సీనియర్ జర్నలిస్ట్ , తెలంగాణ ఉద్యమకారుడు చుక్క గంగారెడ్డి

జగిత్యాల తాజా కబురు:అక్రిడిటేషన్ కార్డ్ ఉన్న విలేఖరులే తన కార్యక్రమానికి రావాలని వాఖ్యలు చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ వెంటనే జర్నలిస్ట్ లకు భేషరతుగా, బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కారుడు, జగిత్యాల ప్రెస్ క్లబ్ కోర్ కమిటీ సభ్యులు చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే తన స్థాయికి తగ్గి జర్నలిస్టులపై వాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఏకంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడినే నీకు అక్రిడిటేషన్ కార్డ్ ఉందా అని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించడం తన స్థాయికి తగదన్నారు. అత్యంత ఉధృతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది యువత, విద్యార్థులు ప్రాణ త్యాగాలు చేశారని, ప్రతి పౌరుడు ఆ ఉద్యమంలో స్వచ్చందంగా పాల్గొన్నారని అన్నారు. అలాంటి ఉద్యమంలో ఎక్కడా కూడా కానరాని డా.సంజయ్ కుమార్ నేడు ఎమ్మెల్యే అయినంత మాత్రాన ఉద్యమంలో అత్యంత కీలకంగా పని చేసిన జర్నలిస్టులను ఈ విధంగా కించపరచడం, అక్రిడిటేషన్ లేదని అవమాన పరచడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల సేవలు, కృషి, ప్రాంతీయ పత్రికల సేవలు, వాటి కృషి మరువలేనివన్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ ఉద్యమ కార్యక్రమాలను తమ భుజస్కంధాలపై వేసుకొని నిర్వహించిన ఘనత జర్నలిస్టులదేనని ఆయన బాహాటంగా తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో కూడా జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటాలను వెలికి తీసి యావత్ ప్రపంచానికి తెలియజేసి తెలంగాణ సాధనలో ప్రధాన భూమిక పోషించింది పాత్రికేయులేనని ఆయన సూచించారు. అలాంటి జర్నలిస్టుల శ్రమ, త్యాగం, కృషి ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో నేడు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇలాంటి వాఖ్యలు చేయడం సరికాదన్నారు.గతంలో ప్రతి జర్నలిస్ట్ కు ప్రభుత్వం ద్వారా అక్రిడిటేషన్ కార్డ్ ఇచ్చేవారని, స్వ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కెసిఆర్ ప్రభుత్వంలోనే జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు కరువయ్యాయని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి నేడుపని చేస్తున్న ప్రతి జర్నలిస్ట్ కు ప్రభుత్వంచే అక్రిడిటేషన్ కార్డ్స్, జీవనభృతి ఇప్పించాల్సింది పోయి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏకంగా తన కార్యక్రమానికి అక్రిడిటేషన్ కార్డ్ ఉన్న జర్నలిస్ట్ లే రావాలని ఆంక్షలు విధించడం బాధాకరమన్నారు.వెంటనే జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ యావత్ పాత్రికేయులకు భేషరతుగా “బహిరంగ క్షమాపణ” చెప్పాలని చుక్క గంగారెడ్డి డిమాండ్ చేశారు. లేనిపక్షములో అన్ని జర్నలిస్టు సంఘాలను, ఉద్యమ కారులను, ప్రజా సంఘాలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలను చేపడుతామని ఆయన హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here