ఈశ్వరా…. మీ వాఖ్యలే నిజమవుతున్నాయి

0
292

నిధులకు రెండేండ్లు – శిలపలకానికి నెల

అయినా ప్రారంభం కాని పనులు

అఖిల పక్షం నేతల ఆరోపణ

తాజా కబురు ప్రత్యేక ప్రతినిధి బుగ్గారం: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నోటి నుండి గత జూన్ 2న బుగ్గారంలో జాలువారిన వాఖ్యలే నిజమని అధికార పార్టీ నేతలు నిరూపిస్తున్నారని అఖిలపక్షం నేతలు ఆరోపించారు. గురువారం తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు నగునూరి వెంకన్న గౌడ్, బిజెపి నాయకులు కప్పల మల్లేష్, చుక్క మల్లారెడ్డి, గొండ వెంకటేష్, సుంకం ప్రశాంత్ తదితరులు బుగ్గారంలో డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్న ప్రజా సమస్యలు, కొద్దిపాటి వర్షాలకే బురద మయం అయిన రోడ్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత జూన్ 2న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారని అన్నారు. ఆరోజే శంఖుస్థాపన సమయంలో కొబ్బరికాయ కొట్టే ముందు ఈ శిలాపలకాలు కూడా ఇలాగే ఉంటాయా..? ఇకనైనా పనులు అవుతాయా…? అని స్థానిక నేతలను మంత్రి ప్రశ్నించారని అన్నారు. అలాగే బుగ్గారం జిల్లా పరిషత్ హై స్కూల్ లో జరిగిన బహిరంగ సమావేశంలో కూడా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ బుగ్గారం నాయకులకు అభివృద్ధి పనుల మీద శ్రద్ధ లేదని, ఇచ్చిన ప్రొసీడింగ్ పనులన్నీ అలాగే పెండింగ్ లో ఉన్నాయని చీవాట్లు పెట్టారని అఖిలపక్షం నేతలు ఈ సందర్భంగా గుర్తుచేశారు.
మంత్రి మాటలే నిజమని నిరూపిస్తూ నిధులు మంజూరై ఏండ్లు గడిచినా, శిలాపలకాలు వేసి నెలలు గడిచినా ఇంకా పనులు ప్రారంభం చేయడం లేదని ఆరోపించారు. డిఎంఎఫ్ టి 2018 ద్వారా మంజూరైన సిసి రోడ్డు పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ జూన్ 2న శంఖుస్థాపన చేసి నేటికి నెల గడిచినా పనులు ఇంకా ప్రారంభం కాలేదని తెజస, కాంగ్రెస్, బిజెపి నేతలు ఆరోపించారు. సిసి రోడ్లు చేయక కొద్దిపాటి వర్షాలకే బురదమయం అయిన రోడ్లతో, డ్రైనేజీలు లేక మురికి నీటితో బుగ్గారం ప్రజలు అనేక ఇబ్బందులు పడడమే గాక అనారోగ్యాల పాలౌతున్నారని తెలిపారు. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్నా బుగ్గారం అభివృద్ధి కి నోచుకోలేదని, నేడు మండల కేంద్రం అయికూడా స్వరాష్ట్రంలో కూడా నిధులు వచ్చి నాయకుల, ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధిలో వెనుకబడి పోతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యం వీడి బుగ్గారం మండల కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని అఖిలపక్షం నాయకులు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here