హుజురాబాద్ బరిలో ఎల్ రమణ ? గెలిస్తే మంత్రి, ఓడితే ఎమ్మెల్సీ ఒప్పందం..?

0
71

జగిత్యాల తాజా కబురు : రేపో మాపో అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరనున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు ఎల్ రమణ, హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్టు సమాచారం.రమణ గెలిస్తే క్యాబినెట్ మంత్రి పదవి, ఓడితే ఎమ్మెల్సీ పదవి సరిపెట్టుకోవాల్సి ఉంటుందనే చర్చ ఆయా పార్టీ శ్రేణులలో నడుస్తుంది. ఈ నెల 8న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి ప్రగతి భవన్ లో, సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసిందే. చర్చల సారాంశం, వివరాలు ఆ నలుగురికి మినహా ఇతరులకు తెలిసే అవకాశం లేదు.రమణ అనుచర వర్గం, మాత్రం తమ నాయకుడికి కె.సి.ఆర్.తో జరిగిన ఒప్పందం మంత్రి పదవి, లేదా ఎమ్మెల్సీ,అంటూ వారు ఆనందడోలికల్లో తేలిపోతున్నట్టు చర్చ.

మంత్రి పల్లె నిద్రలో ఫైనల్ చర్చలు..?

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ నెల మొదటి వారంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జగిత్యాల అసెంబ్లీ పరిధి గ్రామంలో పల్లెనిద్ర చేపట్టారు. ఆయనతోపాటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఇంటిలో ( మెట్టుపల్లి ) లో ఆయనతో కలిసి భోజనం చేశారు.పట్టణ ,పల్లె ప్రగతి, కార్యక్రమాలు రాష్ట్రంలో పల్లెనిద్ర చేసిన ఏకైక మంత్రి దయాకర్ రావు ఒక్కరే కావడం విశేషం.
గత జూన్ మొదటి వారంలో రమణ టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రచారం జరిగింది. తనను పార్టీలోకి రమ్మని ఆహ్వానించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనకు ఫోన్ చేశారని కూడా రమణ స్పష్టం చేశాడు. రమణ జూన్ 13, 14 తేదీలలో తన అనుచరగణంను కలసి జగిత్యాలలో. పార్టీ మారడం, అంశంపై వారి అభిప్రాయాలను, తెలుసుకున్నారు. మరుసటి రోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తనకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఎన్టీరామారావు ,రాజకీయ పదవులు, కల్పించింది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం అని నేను విద్యార్థిని అంటూ రమణ విలేకరులకు వివరించారు.ఇది ఇలా ఉండగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న నిజాంబాద్ ఎమ్మెల్సీ సీఎం కేసీఆర్ గారాల తనయ, కల్వకుంట్ల కవిత, ఆ వేదికపై నుంచి మాట్లాడుతూ, ” రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరుగుతాయని, ఏది జరిగిన టిఆర్ఎస్ పార్టీకి మంచి జరుగుతుందని, ఈ అంశంపై ఇంతకంటే అధికంగా మాట్లాడను అంటూ ముగించడం కొసమెరుపు. పిదప ఆమె విద్యానగర్ లోని, న్యాయవాది ఇంటిలో ఓ ప్రముఖుడి తో ప్రత్యేకంగా, గంటపాటు వివిధ అంశాలపై చర్చించి, కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం గమనార్హం. దాదాపు నెలరోజులుగా రమణ టిఆర్ఎస్ పార్టీలో చేరికపై చడీ చప్పుడు లేని సమయంలో ఒకేసారి, సీఎం కేసీఆర్ నుండి రమణ కు పిలుపు రావడం,మంత్రి దయాకర్ వెంట తీసుకుని వెళ్లడం, గంటన్నరపాటు చర్చ జరగడం. ఈ సందర్భంలో సి ఎం కేసీఆర్ రమణ ను ఉద్దేశించి. ” మీలాంటి అనుభవం గల నాయకులు, అధికారంలో ఉన్న మా పార్టీ కి సహాయ సహకారాలు అందిస్తే బడుగు బలహీన, వర్గాలకు మీరు చేయూతనిచ్చిన వారవుతారని, మీ అనుభవంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ” అన్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా గత జూన్ మాసంలో రమణ చేరిక పట్ల జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు, అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు గుసగుసలు నాడు వినిపించాయి. రమణ గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా కొనసాగిన సందర్భంలో ఇదే ప్రాంతానికి చెందిన మాజీ మంత్రులు రాజేశం గౌడ్, సుద్దాల దేవయ్య తదితర కీలక నేతలు,గ్రూపులుగా ఏర్పడ్డాయని, తెలుగుదేశం పార్టీలో వారి రాజకీయ ఎదుగుదలకు రమణ అడ్డంకులు సృష్టించాడు అనే ఆరోపణలు గతంలో ఉన్నాయి. రమణ సామాజికవర్గం కోరుట్ల ,జగిత్యాల సెగ్మెంట్లలో అభ్యర్థుల గెలుపు, ఓటములను ప్రభావితం చేస్తుందని ఆయన టిఆర్ఎస్ పార్టీలో చేరితే తమ రాజకీయ భవిష్యత్తు పై రెండు నియోజకవర్గాల కీలక నాయకులు ,ఆందోళన వ్యక్తం చేయడంతో ఆ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యేల సామాజికవర్గానికి చెందిన మంత్రి దయాకర్ రావు,పల్లె ప్రగతి,పల్లెనిద్ర,కార్యక్రమం వీరి సందేహాలను నివృత్తి చేసి రమణ టిఆర్ఎస్ పార్టీలో చేరికకు ఫైనలైజ్ చేసి లైన్ క్లియర్ చేసినట్టు చర్చ నెలకొంది.

రమణకు వీడిన రాజకీయ గ్రహణం !

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, లేకున్నా తనకు పదవులు, ఉన్న లేకున్నా, చంద్రబాబు నమ్ముకొని దాదాపు మూడు దశాబ్దాలుగా ఆ పార్టీలో కొనసాగుతున్నా రమణ , టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్టు ప్రకటించడం, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనకు రాజకీయ గ్రహణం పోయిందని అభిమానులు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

రేవంత్ రెడ్డి అలా ! . ఎల్ రమణ ఇలా ! ఎందుకో.?

చంద్రబాబు సహచరుడిగా, నమ్మినబంటుగా మూడు దశాబ్దాల కాలం పాటు ఆయన మాటే వేదవాక్కు గా కొనసాగిన రమణ పార్టీ రాజీనామా అంశంపై చంద్రబాబు నాయుడు స్పందించకపోవడం గమనార్హం. 2017 అక్టోబర్ మాసంలో నాటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. 30 పేజీల రాజీనామా లేఖను రేవంత్ రెడ్డి స్వయంగా అప్పటి ఏపీ సీఎంగా కొనసాగిన చంద్రబాబు వద్దకు, అమరావతికి వెళ్లి రాజీనామా లేఖను అందించి, బాబుతో రాజీనామా కు సంబంధించిన అంశాల గురించి మాట్లాడిన విషయం తెలిసిందే. 1994 నుంచి పార్టీలో కొనసాగుతున్న రమణ,రెండు సార్లు ఎమ్మెల్యేగా,ఎంపీగా ,మంత్రిగా, తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న రమణ పార్టీని వీడి, టిఆర్ఎస్ లో చేరిక సందర్భంగా పార్టీ సభ్యత్వానికి,అధ్యక్ష పదవికి, రాజీనామాను కేవలం ఫ్యాక్స్ ద్వారా అధ్యక్షుడు చంద్రబాబునాయుడి కి పంపించడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత బాబు,రమణ తో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి పై చర్చించిన సందర్భం లేదనే చర్చ కొనసాగుతున్నది. పార్టీ పర్యవేక్షణ, బాధ్యతలు తెలంగాణలో నందమూరి వంశస్తులకు, ఆంధ్రాలో నారా వంశం వారికి కట్టబెట్టే యత్నంలో బాబు ఉన్నట్టు చర్చ నెలకొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here