నేను మీ ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీని… రైతుల నిరసనలతో మళ్ళీ తెరపైకి వస్తున్న..

0
95

జగిత్యాల ఏప్రిల్01, తాజా కబురు: మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామా పరిధిలోని చక్కర చక్కెర కర్మాగారంను పున ప్రారంభించి చెరుకు రైతులను ఆదుకోవాలని చెరుకు రైతు ఉత్పత్తి దారుల జిల్లా అధ్యక్షులు మామిడి నారాయణ రెడ్డి, రైతు ఐక్య వేదిక అధ్యక్షులు పన్నాల తిరుపతి రెడ్డి అన్నారు. గురువారం జిల్లా లోని పలు రైతు సంఘాల నాయకులను కలిసి చెరుకు ఫ్యాక్టరీని ప్రారంభించేందుకు ఈనెల 5న ఛలో కలెక్టరేట్ కార్యక్రమానికి చెరుకు రైతులు తరలి రావాలని వారు కోరారు.

టీఆర్‌ఎస్ పార్టీ గత సాధారణ ఎన్నికల్లో నెల రోజుల్లో ముత్యంపేట చెరకు ఫ్యాక్టరీని తెరిపిస్తామని హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవడంతో రైతులు ఆందోళన బాట పడుతున్నారా….? ఈ ప్రాంత రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందా……? దాదాపు ఆరేళ్ళ నుండి ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో చాలామంది రైతులు ఇతర పంటలపై దృష్టి సారించినా సరైన అవగాహన లేక, దిగుబడి రాక, గిట్టుబాటు ధర లేక కుంగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎలాగైనా ఫ్యాక్టరీని పునరుద్ధరించి రైతులను, కార్మికులను, ఉద్యోగులను అదుకోవాలని చెరకు రైతులు దీక్షలు చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఫ్యాక్టరీపై ఆధారపడిన మండలాలు
– జగిత్యాల జిల్లా మల్లాపూర్‌, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, మేడిపల్లి, జగిత్యాల, రాయికల్‌, కథలాపూర్‌, నిజామాబాద్‌ జిల్లా కమ్మరిపల్లి, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌.

గతంలో ‘ఉపాధి’ పొందిన వారు
ఐదువేల మంది రైతులు
రెండువేల మంది కార్మికులు
ప్రత్యక్షంగా, పరోక్షంగా 40వేల మంది

గతమెంతో ఘన చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారం రాజకీయ నాయకులకు ఎన్నికల నినాదంగా మారింది. 2014 ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ పరం చేస్తామన్న హామీ బుట్టదాఖలైంది. తాజా ప్రచారంలో పునరుద్ధరణ హామీలతో మరోసారి తెరపైకొచ్చింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఏకైక వ్యవసాయాధారిత పరిశ్రమ ముత్యంపేట చక్కెర కర్మాగారంపై వేలాది రైతులు ఆధారపడి ఉన్నారు.


జిల్లాలో తొలిసారిగా వ్యవసాయ ఆధారితంగా చక్కెర ఫ్యాక్టరీని మల్లాపూర్‌ మండలంలో 1979-80లో నెలకొల్పారు. 1981-82 నుంచి క్రషింగ్‌ ప్రారంభించింది. అప్పటి విద్యాశాఖ మంత్రి స్థానిక ముత్యంపేట వాసి అయిన వర్దినేని వెంకటేశ్వర్‌రావు సుమారు 250 ఎకరాల్లో బోధన్‌ చెక్కర ఫ్యాక్టరీకి అనుబంధంగా ఈ పరిశ్రమ ప్రారంభించారు. ప్రభుత్వం ఆధీనంలో ఓ వెలుగు వెలిగిన ఈ పరిశ్రమ 16 ఏండ్ల కింద అప్పటి సీఎం చంద్రబాబు హయాంలో అమ్మకానికి బలైంది. ఆ సమయంలో ఆర్థిక సంస్కరణల పేరుతో నష్టాలను బూచిగా చూపుతూ కరీంనగర్‌ జిల్లా ముత్యంపేట, నిజామాబాద్‌ జిల్లా బోధన్‌, మెదక్‌ జిల్లా జహీరాబాద్‌, ముంబోజుపల్లి చెక్కర ఫ్యాక్టరీలను అమ్మాలని నిర్ణయించారు. వందల కోట్ల విలువైన బోధన్‌, ముంబోజుపల్లి, ముత్యంపేట ఫ్యాక్టరీల్లో 49శాతం వాటాను రూ.26.83కోట్లకు 2002-03లో డెల్టా పేపర్‌ మిల్‌ గ్రూప్‌ యజమాని బి.గంగరాజుకు విక్రయించారు. మిగతా వాటా ప్రభుత్వానిది. ప్రభుత్వం, డెల్టా పేపర్‌ మిల్‌ యాజమాన్యం ఉమ్మడి ఆధీనంలో ముత్యంపేట ఫ్యాక్టరీ నడిచింది. ప్రభుత్వం వాటా 51 శాతం ఉన్నా రైతులకు మద్దతు ధర అందక ప్రతి ఏడాదీ ఆందోళనలు చేయాల్సి వచ్చేది. తర్వాత పూర్తిగా ప్రయివేట్‌ పరమయ్యాక మద్దతు ధర అందక చెరకు సాగుపై రైతులకు ఆసక్తి తగ్గింది. చెరకు సాగు వందల ఎకరాలకు పడిపోయింది.

నేటికీ అమలుకాని టీఆర్‌ఎస్‌ హామీ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 ఎన్నికల్లో ఇక్కడ ప్రచారం నిర్వహించిన టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలంతా తమ ప్రభుత్వం ఏర్పడితే కర్మాగారాన్ని స్వాధీనం చేసుకుని రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 2015వరకు నాన్చుతూ వచ్చారు. చివరకు నష్టాల బూచితో 2015 డిసెంబర్‌22న లే ఆఫ్‌ ప్రకటించి మూసేశారు. కాగా గత వ్యవసాయ శాఖ మంత్రి శ్రీనివాస్‌రెడ్డి, అప్పటి ఎంపీ ప్రస్తుత నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, గతంలో స్థానిక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్‌ ఎన్‌డీసీఎల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న చక్కెర కర్మాగారాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, నిర్వహణ మాత్రం రైతులే సహకార పద్ధతిలో నడిపాలని చెప్పడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. దీంతో గతంలో టీఆర్‌ఎస్‌కు ఓటేయబోమని రైతు ఉత్పత్తుల సంఘం, షుగర్‌ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో రైతులంతా కలిసికట్టుగా తీర్మానం చేశారు.

ప్రస్తుతం చెరుకు రైతులు అసెంబ్లీని ముట్టడి చేసే వరకు పరిస్థితి వచ్చిన ప్రభుత్వం మాత్రం చెరుకు రైతుల వైపు చూడటం లేదని, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఎంపీ అర్వింద్ చొరవ తీసుకొని ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు కృషి చేయాలని చెరుకు రైతులు, రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here